: రాజన్ మనసు దోచిన గోల్కొండ...సౌండ్ అండ్ లైట్ షోకు మంత్రముగ్ధుడైన ఆర్బీఐ గవర్నర్
భాగ్యనగరి సిగలోని గోల్కొండ కోట భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ మనసు దోచేసింది. కోట చారిత్రక నేపథ్యాన్ని కాపాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా రాజన్ ను మంత్రముగ్ధుడిని చేశాయి. నిన్న కుటుంబ సమేతంగా హైదరాబాదు వచ్చిన రాజన్ నేరుగా గోల్కొండ కోటను సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షోను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళుతూ సందర్శకుల పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. ‘‘అద్భుతమైన ప్రదర్శనిది. ఇక్కడ గొప్ప వాతావరణాన్ని సృష్టించారు. మీరు చరిత్రను సజీవంగా ఉంచుతున్నారు’’ అంటూ ఆయన ఆ పుస్తకంలో తెలంగాణ పర్యాటక శాఖ కృషిని ఆకాశానికెత్తేశారు.