: భారీగా పెరిగిన రూపాయి విలువ!
డాలర్ తో రూపాయి మారకపు విలువ గణనీయంగా మెరుగుపడింది. ఈ ఉదయం ఫారెక్స్ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 34 పైసలు తగ్గి రూ. 64.78 రూపాయలకు చేరింది. అమెరికన్ కరెన్సీని విక్రయించేందుకు ఎగుమతిదారులు ముందుకు రావడమే ఇందుకు కారణమని, ఇదే సమయంలో విదేశాల నుంచి భారత్ వస్తున్న నిధుల మొత్తం పెరగడమూ రూపాయి విలువను పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రూ. 65.12 డాలర్ల వద్ద కొనసాగగా, నిన్న దసరా పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయ లేదు. కాగా, మరోవైపు స్టాక్ మార్కెట్లు సైతం నేడు దూసుకుపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 189 పాయింట్లు పెరిగి 27,477 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే ఇది 0.70 శాతం అధికం.