: కాళ్లు పట్టుకుని కాదు...కాలర్ పట్టుకుని అడగండి: ‘హోదా’పై దేవినేని అవినాశ్ డిమాండ్


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం కేంద్రం కాళ్లు పట్టుకోవడాన్ని మాని, కాలర్ పట్టుకుని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. నిన్న రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోదీ ప్రత్యేక హోదాను ప్రస్తావించని వైనంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం విజయవాడలో అవినాశ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన అవినాశ్ ఏపీ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబునాయుడి తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంపై పోరు ప్రకటించడమొక్కటే మార్గమని ఆయన తేల్చిచెప్పారు. శంకుస్థాపన సందర్భంగా ఏపీ సమస్యలను ఏకరువు పెడుతూ మోదీ ముందు చంద్రబాబు మోకరిల్లిన చందంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రాన్ని బతిమాలుకునే దుస్థితి నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజల పరువు తీయవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. అదే పద్ధతిని కొనసాగిస్తే తాము చూస్తూ ఉరుకునేది లేదని అవినాశ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News