: ఇక రాజధాని నిర్మాణంపై దృష్టి...మరికాసేపట్లో శంకుస్థాపన కమిటీతో చంద్రబాబు భేటీ
ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనను ఏపీ సర్కారు దిగ్విజయంగా ముగించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిన్న ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ నోట ప్రత్యేక హోదా, ప్యాకేజీలకు సంబంధించి హామీ పొందకపోవడం మినహా కార్యక్రమంతా అనుకున్నట్టుగానే నయనానందకరంగా జరిగింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులంతా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ పట్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా వేలెత్తిచూపని విధంగా శంకుస్థాపనను చంద్రబాబు కేబినెట్ ముగించింది. ఇక అసలు కార్యక్రమం మొదలు కానుంది. రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన మరికాసేపట్లో శంకుస్థాపన కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజధాని నిర్మాణ పనుల నిర్వహణ, కంపెనీని ఎంపిక చేయడం తదితర విషయాలపై ఈ భేటీలో చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.