: డ్రైవర్ ‘చేతిలో’ బస్సు స్టీరింగ్... బెంబేలెత్తిన ప్రయాణికులు


అయినా బస్సు స్టీరింగ్ డ్రైవర్ చేతిలో కాకుంటే, ప్రయాణికుల చేతిలో ఉంటుందా? మరి డ్రైవర్ చేతిలో బస్సు స్టీరింగ్ ఉంటే, ప్రయాణికులు ఎందుకు బెంబేలెత్తినట్లు? స్టీరింగ్ డ్రైవర్ చేతిలోనే ఉండాలి కానీ, అది బస్సు యాక్సిల్ కు అతుక్కుని ఉండాలి. బస్సు మార్గాన్ని దిశానిర్దేశం చేసేలా ఉండాలి. కాని అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గుళపాళ్యం వద్ద వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్, యాక్సిల్ లో కట్ అయిపోయి మొత్తంగా డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది. దీనిని చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే స్టీరింగ్ మొత్తం ఊడిపోయి తన చేతిలోకి వచ్చినా, ఏమాత్రం తొట్రుపాటు లేకుండా ఆ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపేశాడు. దీంతో ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ బస్సు దిగేశారు. జిల్లాలోని ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నేటి ఉదయం ఉరవకొండ నుంచి గుంతకల్ కు వెళుతున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News