: మరోసారి ఇద్దరు ‘చంద్రు’ల కలయిక?... వేదిక కానున్న దత్తన్న అలయ్ బలయ్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య అరమరికలు లేని సంబాషణ చోటుచేసుకుంది. ఆత్మీయ కరచాలనాలు, కుశల ప్రశ్నలు, తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి, పొరుగు రాష్ట్రం నుంచి అందాల్సిన సహకారం తదితరాలపై వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. అంతకుముందు అమరావతికి ఆహ్వానం అందించేందుకు చంద్రబాబు నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగానూ ఇరువురి మధ్య అరమరికలు లేని చర్చలు జరిగాయి. తాజాగా నేడు మరోమారు ఇద్దరు సీఎంలు కలవనున్నారు. ఇందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాదులో నేడు ఏర్పాటు చేయనున్న అలయ్ బలయ్ వేడుక వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ తో పాటు చంద్రబాబుకూ దత్తన్న ఆహ్వానాలు అందించారు. గతేడాది దత్తన్న నిర్వహించిన అలయ్ బలయ్ కి ఇద్దరు సీఎంలు హాజరైన విషయం తెలిసిందే. నేటి వేడుకకు కూడా వారిద్దరూ హాజరయ్యే అవకాశాలున్నాయి.