: సెంటరాఫ్ అట్రాక్షన్ గా నారా లోకేశ్... షేక్ హ్యాండ్ కోసం క్యూ కట్టిన అతిథులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుక వివిధ రంగాల ప్రముఖులతో కళకళలాడుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు శంకుస్థాపన స్థలి ఉద్ధండరాయునిపాలెం చేరుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో కేటగిరీ వీఐపీ గేట్ నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులతో కలిసి వచ్చిన నారా లోకేశ్ అప్పటికే అక్కడికి విచ్చేసిన ప్రముఖులతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ తో కరచాలనం కోసం, ఆయనతో పరిచయం కోసం చాలా మంది ప్రముఖులు కూర్చున్న సీట్లలో నుంచి లేచి మరీ నిల్చున్నారు. టీవీ9 రవి ప్రకాశ్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర నాథ్ చౌదరి తదితరులు లోకేశ్ తో కరచాలనం కోసం ఆసక్తిగా ఎదురుచూడటం కనిపించింది.