: మోదీ ఏం సమాధానం చెబుతారు?: నిలదీసిన రాహుల్ గాంధీ


దేశంలో బలహీనులు బలవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఏం సమాధానం చెబుతారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. ఢిల్లీ శివారు ప్రాంతం, హర్యానాలోని సున్ పెడ గ్రామంలో అగ్రవర్ణ దాడికి గురైన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆ పార్టీతో సంబంధం ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యాతా రాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ఇలాంటి విద్వేషపూరిత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సమాజంలో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారే బీజేపీ పాలనలో దాడులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. వీటన్నింటిపై ప్రధాని ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని ఆయన విమర్శించారు. కాగా, సున్ పెడ గ్రామంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న దళితుల నివాసాన్ని కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడగా, వారి తల్లి 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

  • Loading...

More Telugu News