: ఏంటీ ఏర్పాట్లు? ఇలాగైతే పరువు పోతుంది!: కృష్ణా, గుంటూరు కలెక్టర్లను నిలదీసిన బాబు
శంకుస్థాపన ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని అధికారులను నమ్మి పనులు అప్పగిస్తే, సమన్వయ లోపంతో పరువు తీసేలా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "నేను చెప్పిందేమిటి? మీరు చేసిందేమిటి? అధికారులపై నమ్మకంతో దేశవిదేశీ ప్రముఖులను ఆహ్వానించా. ఇలాగేనా పనులు చేయించేది? మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయి? శంకుస్థాపన అయిపోయిన తరువాతా?" అని ఆయన నిప్పులు చెరిగారు. తనకు సరైన సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఊగిపోయారు. ఎంతమంది ప్రజలు ఈ ఉత్సవాలకు వస్తారో కూడా తెలియని అధికారుల మధ్య సమన్వయలేమి బాగా ఉన్నట్టుందని వ్యాఖ్యానించిన ఆయన, చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? అని గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లను ప్రశ్నించారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించిన చంద్రబాబు, సభా ప్రాంగణంలో మరుగుదొడ్ల ఏర్పాటుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, గత రెండు రోజుల నుంచి వచ్చిన సందర్శకులు పడ్డ ఇబ్బందులు చూసైనా, ఆలోచన రాలేదా? అని ప్రశ్నించారు.