: ఐసీయూలో ఆసుపత్రి సిబ్బంది డ్యాన్స్ లు!.. ఆ వీడియో చూడండి
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సోలా సివిల్ ఆసుపత్రి సిబ్బంది అక్కడి ఐసీయూలో డ్యాన్స్ లు చేసి నానా హంగామా చేయడంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. ఆ రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నితిన్ భాయ్ పటేల్ ఆ ఆసుపత్రిలో కొత్త డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించి వెళ్లిన అనంతరం అక్కడి సిబ్బంది గార్బా డ్యాన్స్ లు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మీడియాలో హల్ చల్ చేసింది. ఐసీయూలో పేషెంట్లను పట్టించుకోకుండా ఇటువంటి పనులా చేసేదంటూ విమర్శలు తలెత్తాయి. ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ హెచ్.కె.భవ్సర్ వివరణ యిస్తూ, డ్యాన్స్ లు చేసే కార్యక్రమానికి తామేమి ప్లాన్ చేయలేదని, డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత కొందరు నర్సులు, బోయ్ లు, రోగులు కలిసి డ్యాన్స్ లు చేశారని అన్నారు. ఈ విషయం తమకు తెలియగానే డ్యాన్స్ లు ఆపించామని, ఈ సంఘటనకు బాధ్యులైన వారందరికీ నోటీసులు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.