: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సెహ్వాగ్
భారత డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్నిరకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్ లో కూడా ఆడనని చెప్పాడు. ఇన్నేళ్లపాటు తన వెంట ఉండి ప్రేమను, అభిమానాన్ని పంచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. బంతిని ఊచకోత కోయడం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన బ్యాట్స్ మెన్ సెహ్వాగ్. వన్డే, టెస్ట్, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా సరే... సెహ్వాగ్ ఆటతీరు మాత్రం ఒకటే. బంతి పడిందా... బౌండరీ దాటిందా... ఇదే సెహ్వాగ్ స్టైల్. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంత సేపు ప్రపంచ మేటి బౌలర్లు కూడా హడలెత్తిపోయేవారు. భారత బ్యాటింగ్ దమ్మును ప్రపంచానికి రుచి చూపించిన సెహ్వాగ్ రిటైర్మెంట్... అభిమానులందరినీ వేదనకు గురి చేస్తోంది.