: ముఖం కడుక్కునే ముందు ఈ జాగ్రత్తలతో మరింత వికాసం!


ఎప్పుడు బయటకు వెళ్లి వచ్చినా ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడం అందరికీ అలవాటు. అదే సమయంలో కాసిన్ని నీళ్లు ముఖంపై చిలకరించుకుని కడుక్కునే వారి సంఖ్యా తక్కువేమీ కాదు. ఇక అతివలైతే పలుమార్లు ముఖం కడుక్కునే అలవాటును కలిగివుంటారు. అయితే, ముఖం కడుక్కునే విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మరింత వికాసం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే పిలవని పేరంటంలా లేనిపోని చర్మ వ్యాధులు సోకే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖం కడుక్కునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... * ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే చేతులకున్న మురికి ముఖాన్ని తాకుంది. దాంతోపాటు బ్యాక్టీరియా ముఖంపై చేరి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. * బాగా చల్లటి లేదా వేడి నీటిని ముఖం కడిగేందుకు వాడకూడదు. గోరువెచ్చని నీటిని వాడటమే మంచిది. * ఎప్పుడైనా ఓ స్క్రబ్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్ వాష్ ను వాడకూడదు. స్క్రబ్ వాడితే ముఖంపై ఉండే సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి. వీటిల్లోకి ఫేస్ వాష్ లోని ఘాటైన రసాయనాలు చేరితే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. * ముఖం కడుక్కున్న తరువాత చల్లగా ఉండే ఐస్ క్యూబ్స్ తో నెమ్మదిగా, ఓ పద్ధతి ప్రకారం వలయ రూపంలో మర్దనా చేసుకుంటే ముఖం మరింత కాంతివంతమవుతుంది. * ఒకవేళ మేకప్ వేసుకుంటే, దాన్ని తొలగించిన తరువాత మాత్రమే ముఖాన్ని కడుక్కోవాలి. మేకప్ తీసివేయకుండా ముఖం కడుక్కుంటే దద్దుర్లు ఏర్పడే ప్రమాదముంది. * కురులకు హెన్నా పెట్టినా, మరేదైనా ఆయిల్స్ వాడినా, కేవలం జుట్టును మాత్రమే కడుక్కుంటే ప్రమాదంలో పడ్డట్టే. ఆ సమయంలో విధిగా ముఖం కూడా కడుక్కోవాలి. * ముఖాన్ని కడిగేందుకు ఘాటైన సోప్ లను వాడకుండా మైల్డ్ గా ఉండే సోప్ లనే వాడాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, ముఖ సౌందర్యం చెడకుండా పది కాలాలు నిలుస్తుందనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News