: తప్పుడు ఆరోపణలతో ఎంతో బాధపడ్డాను: శరత్ కుమార్
నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా తనపై పలు తప్పుడు ఆరోపణలు చేశారని, వాటిని విని తానెంతో బాధపడ్డానని సీనియర్ నటుడు శరత్ కుమార్ వ్యాఖ్యానించాడు. ఎన్నికల్లో పరాజయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నానని ఆయన అన్నాడు. గత 30 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన తాను, ఇకపైనా కోరితే సహకరిస్తానని వివరించాడు. నడిగర్ సంఘ భవన నిర్మాణ ఒప్పందాన్ని గతంలోనే రద్దు చేసుకున్నామని, అయినా తనపై లేనిపోని ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఎన్నికల్లో విజయం సాధించిన పాండవర్ టీం సభ్యులు నాజర్, విశాల్ తదితరులు నడిగర్ సంఘం భవనం కూల్చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘం పేరును మార్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా నాజర్ మీడియాకు తెలిపారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన కరుణానిధి, ఎన్నికల గొడవలు పక్కన పెట్టి నటీనటుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.