: ఎస్.ఎం.కృష్ణ వద్ద కన్నీరు కార్చిన కన్నడ సినీ ముద్దుగుమ్మ
ప్రముఖ కన్నడ సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య కంట తడి పెట్టింది. వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున బాధిత రైతు కుటుంబానికి రమ్య చెక్ అందజేసింది. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకాలం కనిపించకుండా పోయిన రమ్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే చెక్ అందజేసిందంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో, ఈ అందాల భామ తీవ్రంగా కలత చెందింది. నిన్న మధ్యాహ్నం ఆమె మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ నివాసానికి వెళ్లి... జరుగుతున్న దానిపై ఆయనతో చెప్పుకుని కన్నీరు కార్చింది. ఈ విషయంలో తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని తెలిపింది. తన రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రమ్యను ఎస్.ఎం.కృష్ణ ఓదార్చారు. రాజకీయాలలో ఇలాంటివన్నీ సహజమేనని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం కన్నీటితోనే ఆమె బయటకు వచ్చింది. తనకు ఎమ్మెల్సీ కావాలనో, మంత్రి కావాలనో కోరిక లేదని ఆమె తెలిపారు.