: క్రికెట్ కు వీరూ గుడ్ బై?... అభిమానుల్లో కలవరం
ఒక్క భారత్ లోనే కాక ప్రపంచ క్రికెట్ లోనే డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నాడంటూ నిన్న వార్తలు వెలువడ్డాయి. దాదాపు రెండున్నరేళ్లుగా టీమిండియాలో చోటు కోసం నానా పాట్లు పడుతున్న సెహ్వాగ్ రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నాడని తెలియగానే క్రికెట్ అభిమానుల్లో కలవరం మొదలైంది. అయితే వెనువెంటనే స్పందించిన సెహ్వాగ్ తాను రిటైర్ మెంట్ ప్రకటించలేదని తెలిపాడు. తాను చేసిన ప్రకటనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, ఏదేమైనా భారత్ రాగానే దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తానని వీరూ ప్రకటించాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్ లో తన స్పందనను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న వీరూ నిన్న చేసిన ఓ ప్రకటనే ఈ తంతంగానికి కారణంగా నిలుస్తోంది. 2016లో మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంపీఎల్) పేరిట ఓ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో తాను పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు వీరూ ప్రకటించాడు. అయితే ఈ లీగ్ లో పాలుపంచుకోవాలంటే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సిందే. ఈ నేపథ్యంలోనే వీరూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు పలు మీడియా సంస్థలు అతడి నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడక ముందే వార్తలు గుప్పించేశాయి.