: రైతులు పొలాలను వదులుకుంటేనే అభివృద్ధి: వెంకయ్య నాయుడు
అభివృద్ధి కోసం రైతులు తమ పంట పొలాలను వదులుకోక తప్పదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గన్నవరం విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విపక్షాలు కావాలనే భూ సేకరణ అంశాన్ని పెద్దది చేసి విమర్శలు చేస్తున్నప్పటికీ, రైతులు ముందుకు వచ్చినందుకు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. రైతులు త్యాగం చేస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని, రైతులందరికీ అమరావతి ప్రాంత రైతుల తరహాలో ప్యాకేజీలను ప్రకటించాలని ఏపీ సర్కారుకు చెబుతానని ఆయన అన్నారు. శరవేగంగా భూమిని సేకరించేందుకు చంద్రబాబు పాటిస్తున్న విధానం అభినందనీయమని ఈ సందర్భంగా వెంకయ్య వ్యాఖ్యానించారు.