: అమరావతి శంకుస్థాపనకు తప్పకుండా వస్తా: చంద్రబాబుకు చెప్పిన కేసీఆర్
అమరావతి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో అన్నారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికను కేసీఆర్ కు చంద్రబాబు స్వయంగా అందజేశారు. కేసీఆర్ ను శాలువా కప్పి చంద్రబాబు సన్మానించారు. తిరుపతి లడ్డూను ఆయనకు అందజేశారు. అనంతరం వారి భేటీ జరిగింది. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన వారి సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా అమరావతి శంకుస్థాపన, నిర్మాణాల గురించి మాట్లాడుకున్నారు. అమరావతి అభివృద్ధి ప్రణాళిక గురించి కేసీఆర్ ఆరా తీశారు. శంకుస్థాపనకు హాజరయ్యే అతిథులకు రక్షణ చర్యలపై కేసీఆర్ కొన్ని సూచనలు కూడా చేసినట్లు సమాచారం. నదుల అనుసంధానం విషయమై కూడా వారు చర్చించుకున్నారు. అయితే, నదుల అనుసంధానం విషయాన్ని కేంద్రం చూసుకోవాలని కేసీఆర్ అన్నట్లు సమాచారం. అమరావతి, హైదరాబాద్ ల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని కేసీఆర్ తో బాబు ప్రస్తావించారు.