: శంకుస్థాపన కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి!: కేసీఆర్ ను ఆహ్వానించిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ఇద్దరు చంద్రులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ ఆహ్వానపత్రికను కేసీఆర్ కు చంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబసమేతంగా రావాలంటూ కేసీఆర్ ను బాబు కోరారు. ఇద్దరు చంద్రుల భేటీ ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్లి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు కలసి, అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. కాగా, తిరుపతి నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న బాబు, అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లారు.