: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడమే తెలుగుదేశం ప్రస్తుత లక్ష్యం: మాగంటి గోపీనాథ్
బీజేపీతో కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ ఉదయం గ్రేటర్ తెలుగుదేశం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నగర టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన విజయం తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన, తలసాని శ్రీనివాసయాదవ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం గ్రేటర్ లో పాగా వేయడమేనని మాగంటి తెలిపారు.