: నేడు తనకిష్టమైన వాహనంపై శ్రీవారు... చూసేందుకు వస్తున్న ఐదు లక్షల మంది!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. నేడు ఐదవ రోజు దేవదేవుడు తనకిష్టమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేయనున్నాడు. గరుడునిపై కొలువుదీరే శ్రీనివాసుని దర్శించుకునేందుకు ఇప్పటికే 3 లక్షల మంది తిరుమలకు చేరుకోగా, సాయంత్రానికి మరో 2 లక్షల మంది వరకూ వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా, ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 521 బస్సులను 24 గంటల పాటు నడిపిస్తూ, మొత్తం 3550 ట్రిప్పులు వేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొండ ఎక్కే క్రమంలో ప్రమాదకర మలుపుల వద్ద డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, తిరుమలతో పాటు నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, చెన్నై, తిరుత్తణి తదితర ప్రాంతాల నుంచి కొండపైకి బస్సులు ఉంటాయని తెలిపారు. కాగా, రాత్రి 9 గంటలకు గరుడోత్సవం ప్రారంభం కాగానే, దాన్ని తిలకించిన అనంతరం భక్తులు 10 గంటల నుంచి ఒక్కసారిగా కిందకు దిగేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయంలో గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల ప్రధాన బస్టాండును మూసి వేస్తున్నామని, ప్రతిగా కేంద్రీయ విచారణ కార్యాలయం వెనుక, రాంబగీచ, పాపవినాశనం, నందకం గెస్ట్ హౌస్ ల నుంచి బస్సులను నడిపిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక తిరుపతిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ జాంలకు అవకాశం లేకుండా ఈ బస్సులు అలిపిరి వరకు మాత్రమే వెళ్తాయని చెప్పారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్, బస్టాండ్ లకు ఉచిత బస్సులను వేసినట్టు వివరించారు. క్యూ లైన్లలో, మాడవీధుల్లో ఉండే భక్తులకు అన్న పానీయాలను పంచేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.