: నెల్లూరు వైద్య విద్యార్థిని దివ్యను బలిగొన్న డెంగీ
ప్రాణాంతక డెంగీ దోమ కాటుతో అనారోగ్యానికి గురై ఓ యువ వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన దివ్య (22) నెల్లూరులో వైద్య విద్యను అభ్యసిస్తోంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా, డెంగీ సోకినట్టు నిర్ధారణ అయింది. చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన హరిత (9) అనే బాలిక సైతం డెంగీ వ్యాధితో ఈ ఉదయం మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన మరో 10 మందికి డెంగీ సోకగా, వీరందరికీ వివిధ ఆసుపత్రులలో చికిత్సలు జరుగుతున్నాయి. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న నెల్లూరు జిల్లా వైద్యాధికారుల బృందం గ్రామంలో పర్యటించి ప్రజలకు డెంగీపై మరింత అవగాహన కల్పించే చర్యలు చేపట్టింది.