: గిన్నిస్ రికార్డుల్లోకి అమరావతి శంకుస్థాపన!
ఆంధ్రప్రదేశ్ లోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, దేశంలోని అన్ని నదులు, అన్ని మతాల దేవాలయాలు, మహనీయుల ఇళ్ల నుంచి నీరు, మట్టి సేకరించి అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ఉపయోగించనున్న ఏపీ ప్రభుత్వం, ప్రపంచంలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారని, ఈ రికార్డును గిన్నిస్ పుటల్లోకి ఎక్కించాలని భావిస్తోంది. ఈ దిశగా గిన్నిస్ రికార్డుల్లో స్థానం పొందే అవకాశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమం మొత్తం శాస్త్ర ప్రకారం జరగాలని ఆదేశించిన ఆయన, ప్రార్థనలు, పూజలు, మంత్రాలతో శంకుస్థాపన ప్రాంగణం మారుమోగాలని సూచించారు. మొత్తం 16 టన్నుల మట్టిని సేకరిస్తున్నందున, దీనిలో కొంత సీఆర్డీయే పరిధిలో వెదజల్లాలని ఆయన ఆదేశించారు. మిగతా మట్టి, నీటిని రాజధాని ప్రాంతంలో జరిగే ప్రతి నిర్మాణంలోనూ కలపాలని ఆదేశించారు. శంకుస్థాపన శిలాఫలకం వందేళ్లు నిలిచేలా సహజ సిద్ధమైన బండరాయిపై చెక్కించాలని కూడా ఆయన ఆదేశించారు.