: అపాయింట్ మెంట్ కోరుతూ మోదీకి జగన్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 22న అమరావతి శంకుస్థాపనకు వచ్చే సందర్భంగా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలవాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని, ఇటీవల గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశానని తెలియజేశారు. అయితే తన దీక్షను ఏపీ ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని వివరించారు.