: తప్పయితే క్షమించండి... మీడియాకు సారీ చెప్పిన పవన్ కల్యాణ్
మీడియా ప్రతినిధులపై తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (బౌన్సర్లు) చేసిన దాడికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. హైదరాబాదు, నానక్ రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్ కల్యాణ్ కు అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని అందించేందుకు ఏపీ మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పవన్ కల్యాణ్ బౌన్సర్లు దాడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడే నిరసనకు దిగారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ నేపథ్యంలో సినిమా గెటప్ లోనే బయటకు వచ్చిన పవన్ కల్యాణ్, మంత్రుల సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. అనుకోకుండా జరిగిన ఘటనకు సంబంధించి తన బౌన్సర్ల తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని పవన్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. మీడియా వెంట ఇతరులు కూడా స్టూడియోలోకి వస్తుంటారని, ఈ కారణంగానే తన బౌన్సర్లు అడ్డుకుని ఉంటారని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తన బౌన్సర్ల తప్పిదం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బౌన్సర్లు తమపై విరుచుకుపడిన దృశ్యాలను ఓ కెమెరామన్ తన కెమెరాలో చూపించగా, పవన్ ఆసక్తిగా పరిశీలించారు.