: ప్రతి పరీక్షలోనూ 'సేఫ్' అని తేలింది... తిరిగొస్తున్న నెస్లే మ్యాగీ నూడుల్స్
రెండు నెలల క్రితం నిషేధానికి గురైన మ్యాగీ నూడుల్స్ తిరిగి మార్కెట్లోకి రావడానికి మార్గం సుగమమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నెస్లే మ్యాగీకి చెందిన 6 వేరియంట్లకు చెందిన 90 శాంపిల్స్ సురక్షితమైనవేనని నివేదికలు రావడంతో, తిరిగి నూడుల్స్ తయారీ ప్రారంభించాలని మ్యాగీ నిర్ణయించుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాలను అనుసరించి జైపూర్, మొహాలీ, హైదరాబాద్ నగరాల్లోని మూడు అధీకృత ల్యాబొరేటరీలు ఈ పరీక్షలను నిర్వహించాయి. ఇవన్నీ తినేందుకు అర్హమైనవేనని తేల్చాయి. ఈ నూడుల్స్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం, అన్ని రసాయనాలూ పరిమితుల్లోనే ఉన్నాయని తెలిపాయి. ఈ విషయాన్ని నెస్లే ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నివేదికలతో బాంబే హైకోర్టును సంప్రదించనున్నామని, కోర్టు నుంచి అనుమతులు రాగానే నూడుల్స్ తయారీ ప్రారంభిస్తామని వివరించింది.