: వరంగల్ లో భారీ వర్షం... తడిసిన వేలాది క్వింటాళ్ల పత్తి... రైతుల గగ్గోలు
తెలంగాణలో పత్తి రైతన్నల పరిస్థితి 'మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు' అయింది. గత వారం రోజుల వ్యవధిలో పత్తి ధర గణనీయంగా పడిపోయి, రైతులకు గిట్టుబాటు ధర లభించక బాధపడుతున్న తరుణంలో, వారిపై వరుణుడు ఆగ్రహం చూపించాడు. మార్కెట్ యార్డులకు విక్రయాల నిమిత్తం భారీగా పత్తి వచ్చిన వేళ భారీ వర్షం పడటంతో వేలాది క్వింటాళ్ల పత్తితో ఉన్న బస్తాలు తడిసిపోయాయి. ఈ ఉదయం పడ్డ భారీ వర్షానికి వరంగల్ లోని మార్కెట్ యార్డులో ఉన్న 40 వేలకు పైగా పత్తి బస్తాలు నీటిలో తడిశాయి. దీంతో ఆ పత్తిని కొనలేమని వ్యాపారులు చేతులెత్తేశారు. రెండు రోజుల క్రితం పత్తిలో తేమ ఉందని కొనుగోళ్లు ఆపివేయడంతో యార్డులో భారీ స్థాయిలో నిల్వలు పెరిగాయి. ఇప్పుడు వచ్చిన వర్షంతో రైతులు మరింత బాధపడాల్సిన పరిస్థితి. తడిసిన పత్తిని తక్షణమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు.