: జగన్ పై నారా లోకేశ్ విసుర్లు... మనసు మార్చుకుంటే మంచిదని వ్యాఖ్య!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ఏపీ ప్రజల కలల రాజధానిగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిలవబోతోందన్న ధ్యాసే జగన్ ను నిలువనీయడం లేదని లోకేశ్ విమర్శించారు. అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పడం జగన్ కు తగదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాను రాజధాని శంకుస్థాపనకు రాలేనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి జగన్ బహిరంగ లేఖ రాసిన వైనంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన తన లక్ష కోట్ల సంపదను జగన్ రాజధాని నిర్మాణానికి అందిస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుంటే మంచిదని కూడా లోకేశ్ వ్యాఖ్యానించారు.