: ఉల్లి ఢమాల్... నిన్నటిదాకా రూ. 50, నేడు రూ. 15
ప్రజల జేబులకు నిన్నటి వరకూ చిల్లు పెట్టిన ఉల్లిపాయల ధరలు పాతాళానికి పడిపోయాయి. గత రెండు, మూడు వారాల వ్యవధిలో వర్షాలు విస్తారంగా కురిసి ఒక్కసారిగా ఉల్లిపాయల పంట కోతకు సిద్ధం కావడంతో మార్కెట్ యార్డుల్లో ఉల్లి కొనే నాథుడు కరవయ్యాడు. దీంతో గత మూడు నెలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టి ఆకాశానికి ఎక్కిన ఉల్లి ధర నేడు కిలోకు రూ. 15కు దిగివచ్చింది. ఈ సీజనులో ఢిల్లీలో అత్యధికంగా రూ. 65, కొన్ని ప్రాంతాల్లో రూ. 80 వరకూ పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పడు ప్రాంతాలను బట్టి రూ. 15 నుంచి రూ. 35 మధ్య పలుకుతోంది. మారుమూల ప్రాంతాలకు కూడా సరఫరా క్రమబద్ధమైతే, రూ. 35 ధర కూడా సగానికి తగ్గనుందని తెలుస్తోంది. చాలా మంది ప్రజలు నవరాత్రి పర్వదినాల సందర్భంగా ఉల్లిని దూరం పెట్టడం కూడా ధరలను దిగివచ్చేలా చేసిందని, ఈజిప్టు, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి ముందుగా ఇచ్చిన దిగుమతి ఆర్డర్లు దేశంలోకి రావడం కూడా ఇందుకు కారణమని నిపుణులు పేర్కొన్నారు.