: ఆ ఇద్దరి మధ్యా వ్యక్తిగత పోరుగా మారిన బీహార్ ఎన్నికలు!


ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీల వ్యక్తిగత పోరుగా మారిపోయాయి. మరే ఇతర నేతల ప్రచారానికీ ప్రజల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదని సమాచారం. మహా కూటమిలో సైతం నేతలు ఐకమత్యంగా ఉండటం లేదు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ దినారాలోని హైస్కూల్ గ్రౌండ్ లో ప్రచారం ముగించి బయలుదేరిన నిమిషాల వ్యవధిలో అక్కడికి మరో హెలికాప్టర్ లో నితీష్ కుమార్ దిగి ప్రసంగించారు. ఈ ఇద్దరు నేతలూ మోదీని విమర్శించినప్పటికీ, ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్లడం మహాకూటమి ఐక్యతపై సందేహాలను పెంచింది. ఇదిలావుండగా, మోదీ అత్యధిక సందర్భాల్లో మిగతా అందరు నేతలనూ పక్కనబెట్టి కేవలం నితీష్ వైఖరిని మాత్రమే ప్రశ్నిస్తుండగా, నితీష్ సైతం అదే దారిలో నడుస్తున్నారు. తాను విమర్శించేందుకు బీహార్ బీజేపీలో సరైన నేతలెవరూ లేకపోవడంతో, ఆయన డైరెక్టుగా మోదీపై విరుచుకుపడుతున్నారు. రెండో దశ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సమయంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన నితీష్, ప్రతి సభలో మోదీపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నలు కూడా సంధించారు. చూసేవాళ్లకు మాత్రం ఈ ఎన్నికల ప్రచారం ఇద్దరు నేతల మధ్య అధికార పోరుగా మాత్రమే కనిపిస్తోందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.

  • Loading...

More Telugu News