: షాపింగ్ మాల్ లో ఎలుగుబంటి... ఏం చేసిందంటే?


రష్యా నగరం కబర్ విస్క్ వాసులు నిన్న రాత్రి బిజీబిజీగా షాపింగ్ చేస్తున్నారు. కొనుగోలుదారులతో నగరంలోని ఓ షాపింగ్ మాల్ కిటకిటలాడుతోంది. అయితే ఒక్క క్షణంలో షాపింగ్ మాల్ నిర్మానుశ్యమైంది. కారణమేంటో తెలుసా? ఓ పెద్ద ఎలుగుబంటి నేరుగా వచ్చి షాపింగ్ మాల్ లోకి దూరేసింది. అడవిలో ఉండాల్సిన ఎలుగు షాపింగ్ మాల్ లో ప్రత్యక్షం కావడంతో బెంబేలెత్తిన ప్రజలు తలో దిక్కు పరుగులు పెట్టారు. జనం మొత్తం ఖాళీ అయిన తర్వాత ఎలుగు కూడా బయట పడేందుకు నానా తంటాలు పడింది. అయితే షాపింగ్ మాల్ చుట్టూ అద్దాలు ఉండటంతో చాలా సేపు ఎలుగు చేసిన యత్నాలు ఫలించలేదు. అయితే కాసేపు అటు ఇటు తిరిగిన ఎలుగు నేరుగా మాల్ ఎగ్జిట్ ద్వారం వద్దకే వచ్చేసింది. అక్కడ కూడా అద్దాలు ఉండటంతో ఇక చిర్రెత్తుకొచ్చి అద్దాలను బద్దలు కొట్టింది. బయటపడగానే బతుకు జీవుడా అంటూ ఎలుగు సమీపంలోని పార్కులోకి పరుగులు పెట్టింది. అప్పటికే జనం ఇచ్చిన సమాచారంతో సైనికులు రంగ ప్రవేశం చేశారు. ఎలుగుపై కాల్పులు జరిపారు. ప్రమాదాన్ని గమనించిన ఎలుగు బుల్లెట్లను తప్పించుకుని పరారైంది. అయినా పట్టు వదలని సైనికులు పరుగులు పెట్టి మరీ ఎలుగును కాల్చి చంపారు.

  • Loading...

More Telugu News