: లారీతో ఢీకొట్టి, కళ్లల్లో కారం చల్లి, వేట కొడవళ్లతో నరికి...వైసీపీ నేత దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఫ్యాక్షన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైసీపీ నేత రాఘవరెడ్డి చనిపోయారు. ఆళ్లగడ్డ పరిధిలోని చింతకుంట గ్రామినికి చెందిన రాఘవరెడ్డిపై నిన్న రాత్రి ఆయన ప్రత్యర్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయనను కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. దాడి జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. ఆళ్లగడ్డలో పనులు ముగించుకుని తన ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి బయలుదేరిన రాఘవరెడ్డిపై ప్రత్యర్థులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారు. తొలుత రాఘవరెడ్డి వాహనాన్ని ప్రత్యర్థులు లారీతో ఢీకొట్టారు. తర్వాత రాఘవరెడ్డి తేరుకునేలోగానే ఆయన కళ్లల్లో కారం కొట్టిన ప్రత్యర్ధులు వేట కొడవళ్లతో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాదాపు పది మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాఘవరెడ్డి హత్య నేపథ్యంలో ఆళ్లగడ్డ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల కింద పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు.