: ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబు... కాసేపట్లో ప్రధానితో భేటీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టారు. మరికాసేపట్లో ఆయన నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ భేటీలో పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం ఆయన సబ్ కమిటీ సభ్యులతో కలిసి 3.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. సబ్ కమిటీ నివేదికను ప్రధానికి అందించనున్న ఆయన అమరావతి శంకుస్థాపనకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక, హోం శాఖల మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లతోనూ ఆయన సమావేశం కానున్నారు.