: మా తాతకు అంతా తెలుసు: బోస్ గురించి లాల్ బహదుర్ శాస్త్రి మనవడు సంచలన వ్యాఖ్యలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, ఆయన మిస్టరీ మరణానికి మరో ట్విస్ట్. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థనాధ్ సింగ్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ భారత ప్రముఖుడిని రష్యా నుంచి స్వదేశానికి తీసుకురావాలని కృషి చేశారని తెలిపారు. ఈ విషయాన్ని ఒకప్పుడు ఆయనే స్వయంగా తనతో చెప్పారని, ఆ వ్యక్తిని ఇండియాకు తీసుకువచ్చేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నేతలను సైతం తన తాతయ్య కలిశారని చెప్పారు. బోస్ పేరును మాత్రం చెప్పకుండా, ఆ వ్యక్తిని కలిసేందుకు కోట్లాది మంది భారత ప్రజలు ఎదురు చూస్తున్నారని అప్పట్లో తన తాతయ్య చెప్పినట్టు ఆయన వివరించారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి సదరు వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కావచ్చని అన్నారు. "నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని ఆయన భావించారు. ప్రజలకు తెలిసిన చరిత్రను సరిచేయాలని కూడ ఆయన అనుకున్నారు" అని తెలిపారు. కాగా, నేతాజీ కుటుంబ సభ్యులు నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న సంగతి తెలిసిందే.