: జగన్ ఆరోగ్యం కుదుట పడింది... డిశ్చార్జీ చేస్తాం: జీజీహెచ్ వైద్యులు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడింది. గుంటూరులోని నల్లపాడులో జగన్ చేపట్టిన దీక్షను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆరు రోజులుగా ఆహారం లేని కారణంగా జగన్ ఆరోగ్యం విషమించింది. దీంతో పోలీసులు జగన్ ను బలవంతంగా గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా వైద్య చికిత్స అనంతరం జగన్ ఆరోగ్యం కుదుట పడిందని జీజీహెచ్ వైద్యులు కొద్దిసేపటి క్రితం తెలిపారు. జగన్ బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయని, జగన్ శరీరంలో పెరిగిన కీటోన్ బాడీస్ కూడా తగ్గుముఖం పట్టాయని వారు తెలిపారు. ఇక జగన్ ను డిశ్చార్జీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు పేర్కొన్నారు.