: ఇద్దరు సీఎంలు ప్రజాసమస్యలను గాలికొదిలేశారు: ఎంపీ గుత్తా
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై టి.కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఒకరు బతుకమ్మల చుట్టూ తిరుగుతుంటే, మరొకరు రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతున్నారని నల్లొండలో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో కరవుతో రైతాంగం అల్లాడుతోందని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. పత్తికి మద్దతు ధర కల్పించి సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని గుత్తా డిమాండ్ చేశారు. తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తుంటే బతుకమ్మ పండుగ నిర్వహించడం విడ్డూరమన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం కాదని, పండుగల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయలను ఉత్సవాల పేరిట దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. నల్లొండ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని గుత్తా కోరారు.