: మోదీ మాతో ఏం చేయిస్తున్నాడో? ఏంటో! అంటూ నిట్టూర్చిన బీజేపీ నేత


వందిమాగధులతో అలా ఓ సారి పర్యటనకు వెళ్లి, కుదిరితే రెండు హామీలు ఇచ్చి, ఇంటికి వెళ్లి ఇతర పనులు చక్కబెట్టుకోవడం రాజకీయ నాయకుల దిన చర్యగా ఉండేది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత బీజేపీ నేతలు పార్టీ కోసం మరింత కష్టపడాల్సి వస్తోంది. దీనికి తోడు స్వచ్ఛభారత్ అంటూ కొత్త నినాదాన్ని ఆయన తీసుకువచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు ఇష్టమున్నా లేకున్నా అందులో పాల్గొనాల్సి వస్తోంది. హర్యాణా న్యాయశాఖ మంత్రి కృషాన్ కుమార్ బేదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. ఆదివారం ఫతేహాబాద్ లో ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా "మోదీ మాతో ఏం చేయిస్తున్నాడో? ఏంటో!" అంటూ నిట్టూర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ, మోదీ చెప్పారనే కారణంగానే అధికారులు బలవంతంగా చీపుర్లు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అది సరికాదని చెప్పేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. హర్యాణా పరిశుభ్రంగానే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News