: లండన్ లో కదిలిన 'మోదీ ఎక్స్ ప్రెస్'
వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు నెల రోజుల పాటు 'మోదీ ఎక్స్ ప్రెస్' పేరిట ప్రత్యేకంగా అలంకరించిన బస్ ను బ్రిటన్ లో తిప్పనున్నారు. 'యూకే వెల్ కమ్స్ మోదీ' పేరిట ఏర్పాటైన కమిటీ తయారు చేసిన ఈ బస్సు బ్రిటన్ లో 'లిటిల్ ఇండియా'గా పేరున్న వాంబ్లేలో బయలుదేరింది. మోదీ పర్యటనను చరిత్రలో నిలిచిపోయేలా చూడాలని భావిస్తున్నామని, నవంబర్ 13న మోదీకి ఒలింపిక్స్ తరహా స్వాగతాన్ని వాంబ్లే స్టేడియంలో ఇవ్వనున్నామని కమిటీ ప్రతినిధి మయూరి పార్మర్ వ్యాఖ్యానించారు. మోదీ ఎక్స్ ప్రెస్ కు ప్రతి ప్రాంతంలోనూ స్వాగతం పలకాలని, బ్రిటన్ లో అతి ఎక్కువ కాలం పాటు సేవలందించిన భారత సంతతి పార్లమెంటేరియన్ గా గుర్తింపున్న కీత్ వాజ్ కోరారు. ఆయన రాకను ఎంతో మంది కోరుకుంటున్నారని బ్రెంట్ కౌన్సిల్ నేత మహమ్మద్ భట్ వ్యాఖ్యానించారు. మోదీ గౌరవార్థం ఇచ్చే రిసెప్షన్ కు 60 వేల మంది హాజరు కానున్నారని, వచ్చే వారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం అవుతాయని రిసెప్షన్ సమన్వయకర్త నితిన్ పాలన్ వివరించారు.