: 'మహా' ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, బీజేపీతో శివసేన కటీఫ్?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రచయితలపై జరుగుతున్న దాడులను ప్రోత్సహిస్తున్న శివసేన... పాక్ కళాకారులను ఎట్టి పరిస్థితుల్లో భారత్ కు రానిచ్చేది లేదని, వారు రాసిన పుస్తకాలను ఇక్కడ ఆవిష్కరించినా సహించబోమని తేల్చి చెబుతూ, మహారాష్ట్రలోని ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సర్కారులో మంత్రులుగా ఉన్న శివసేన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తారని సమాచారం. ఫడ్నవీస్ పాలన పట్ల శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేరని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయన ప్రవర్తన ఎంతో మంది కార్యకర్తలను దూరం చేసుకునేదిగా ఉందని, ఆ పార్టీతో కలసుంటే తాము నష్టపోతామని థాక్రే వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కల్యాణ్ డొంబివిల్ మునిసిపల్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగాలని, బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నట్టు సమాచారం.