: జగన్ దీక్షను పోలీసులు ఎలా భగ్నం చేశారంటే..!
వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరుకోగా, ఓ పక్కా ముందస్తు వ్యూహం ప్రకారం కదిలిన పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తున్న సంకేతాలను డాక్టర్లు వెలువరించడంతో, ఇక అరెస్ట్ తప్పదని, బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న వేళ దీక్షా ప్రాంగణానికి పోలీసులు చేరుకున్నారు. ఆ వెంటనే మీడియా కెమెరాల వైర్లను కట్ చేశారు. ప్రాంగణంలో ఉన్న లైట్లను ఆర్పివేశారు. ఆపై జగన్ ను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి ఓ స్ట్రెచ్చర్ పై తీసుకెళ్లి అంబులెన్స్ లోకి ఎక్కించారు. ఈ సమయంలో కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, వారిపై లాఠీచార్జ్ చేశారు. ఆంబులెన్స్ కు దారికల్పించేందుకు లాఠీలు ఊపుతూ, కొందరు పోలీసులు దాని ముందు పరుగులు పెట్టారు. జగన్ ఉన్న అంబులెన్స్ ను డైరెక్టుగా జీజీహెచ్ కు తీసుకెళ్లి ఆయన్ను ఐసీయూలో చేర్చారు. ఆపై దీక్ష విరమించేందుకు జగన్ నిరాకరించగా, బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.