: ఒక్క క్షణం ఆ విమానంలోని వారంతా భయపడిపోయారు
ఒక్క క్షణం ఆ విమానంలోని వారంతా భయపడిపోయారు. ఏం జరుగుతోందో అని ఆందోళన పడ్డారు. కానీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో వారంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. షార్జా నుంచి కోయంబత్తూరు వస్తున్న అరేబియా ఎయిర్ లైన్స్ విమానం నేటి తెల్లవారు జామున వంద మంది ప్రయాణికులతో కోయంబత్తూరు చేరుకుంది. ల్యాండ్ చేయడానికి పైలట్ సిద్ధమవుతుండగా, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఓ పక్షి విమానాన్ని బలంగా గుద్దుకుంది. దీంతో విమానం ఒక్కసారి పెను కుదుపుకు లోనైంది. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అంతలోనే పైలట్ విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విమానం మరమ్మతులు పూర్తైన తరువాత తిరిగి షార్జా వెళ్తుందని అధికారులు తెలిపారు. కాగా, అదే విమానంలో షార్జా వెళ్లేందుకు ఎదురు చూస్తున్న 160 మంది ప్రయాణికులకు అధికారులు బస ఏర్పాట్లు చేశారు. మరమ్మతులు పూర్తి కాగానే వారిని షార్జా తీసుకెళతారు.