: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ రాజీనామా... పతనమైన షేర్లు
భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం, రెండో అతిపెద్ద ఔట్ సోర్సర్ అయిన ఇన్ఫోసిస్ కు ఆ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎం.డి. రంగనాథ్ సీఎఫ్ఓగా వ్యవహరిస్తారని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్ఫీ తన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన రోజే బన్సల్ రాజీనామా చేయడం విశేషం. సెకండ్ క్వార్టర్ లో అమ్మకాలపై రూ. 15,565 కోట్లను ఇన్ఫీ ఆర్జించింది. నికరలాభం 12.1 శాతం వృద్ధితో రూ. 3,400 కోట్లకు చేరింది. గత 16 త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ కు ఇదే అత్యధిక నికరలాభం. అయినప్పటికీ, బన్సల్ రాజీనామా ఇన్ఫోసిస్ పై ప్రభావం చూపింది. ఉదయం 10.35 గంటల సమయంలో ఇన్ఫోసిస్ షేర్లు 2.90 శాతం పతనమయ్యాయి.