: రోహిత్ శర్మ శ్రమ రెండోసారి వృథా అయింది!
రోహిత్ శర్మ శ్రమ రెండోసారి వృథాగా మారింది. టీమిండియా ఆటగాళ్లు తడబడుతున్న వేళ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20 లో రోహిత్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించి సెంచరీ చేశాడు. ఆ టీ20 లో భారత్ స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అనంతరం జరిగిన రెండో టీ20 లో రోహిత్ ఓ మోస్తరుగా ఆడాడు. అది కూడా ఓటమిపాలైంది. దీంతో టీ20 సిరీస్ సౌతాఫ్రికా గెలుచుకుంది. అనంతరం ఎన్నో అంచనాల మధ్య కాన్పూర్ వేదికగా ప్రారంభమైన వన్డే సిరీస్ లో తొలి వన్డేలో రోహిత్ శర్మ (150) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ అభిమానులను అలరించాడు. రోహిత్ అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టడంతో మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లు భారత్ ను ఆదుకోలేకపోయారు. దీంతో కేవలం 5 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో మరోసారి రోహిత్ సెంచరీ, రహానే అర్ధ సెంచరీ వృథా అయ్యాయి.