: పోలవరం ప్రాజక్టుకు 1943లో బీజం పడితే ఇప్పటికీ పూర్తి కాలేదు: చంద్రబాబు


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేబట్టాలని 1943లో సంకల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తూ, పోలవరం ప్రాజెక్టును మల్టీపర్పస్ టెర్మినల్ గా చేపట్టాలని 1982లో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసిందని అన్నారు. పోలవరం పూర్తయితే ఇరిగేషన్ అవసరాలు, డ్రింకింగ్ వాటర్, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అవసరమైన నీరు వస్తుందని ఆయన చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు మరో నాలుగైదేళ్లు పడుతుందని ఆయన తెలిపారు. పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. అలాగే 960 మెగావాట్ల హైడ్రో పవర్ అందుబాటులోకి వస్తుందని, 80 టీఎంసీల తాగు నీరు ప్రజలకు లభిస్తుందని ఆయన తెలిపారు. పోలవరం పూర్తి కాని కారణంగా 1600 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పోలవరం ప్రాజక్టు పూర్తిచేసేందుకు రాజశేఖరరెడ్డి నడుం బిగించి ఎడమ, కుడి కాల్వల పనులను క్లబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు. ఆ తరువాత సీఎంగా వచ్చిన రోశయ్య పోలవరం పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన గుర్తుచేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి కుడి, ఎడమ కాల్వల పనులు విడగొట్టి, పూర్తి కాకుండానే ఆపేశారని ఆయన చెప్పారు. దీంతో చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లారని, అప్పటి వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజక్టు చేబట్టాలని 1943లో సంకల్పించగా, 1980లో ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుగా ప్రకటించారని, అప్పటి రాష్ట్రీయ, జాతీయ నేతల నిర్ణయాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదని, అంతర్రాష్ట్రాల సమస్యగా మారి, ఛత్తీస్ గఢ్, ఒడిశాలతో ఇబ్బందులు ఏర్పడ్డాయని బాబు తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల సమస్యలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News