: 6 వాచ్ మన్ పోస్టులకు 25 వేల దరఖాస్తులు... సగానికి పైగా గ్రాడ్యుయేట్లవేనట!


ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణకే ఈ వ్యాఖ్య పరిమితం కాలేదు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, రాజధాని కూడా లేకుండా ఓ ముక్కగా మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ కు కూడా ఇది వర్తిస్తుంది. విశాఖలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. వివరాల్లోకెళితే... ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) తన కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6 వాచ్ మన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండి, 35 ఏళ్లకు పైబడ్డ వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో కోరింది. కేవలం ఆరంటే ఆరు ఖాళీల కోసం ఏకంగా 25 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. సరే, దాదాపు మూడేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదు కదా, అందుకే ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయని సర్దిచెప్పుకున్న ఈపీడీసీఎల్ సిబ్బంది దరఖాస్తులను తెరచి విస్తుపోయారట. ఎందుకంటే 25 వేల దరఖాస్తుల్లో సగానికి పైగా అప్లికేషన్లు గ్రాడ్యూయేట్లకు చెందినవట. బీఏ, బీఎస్సీ,బీకాం, బీబీఎం తదితర డిగ్రీలు చదివిన వారితో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన వారూ వాచ్ మన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారట. షాక్ నుంచి తేరుకున్న తర్వాత 317 మందిని షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు వారికి 2.5 కిలో మీటర్ల పరుగు పోటీ నిర్వహించగా, 35 మంది సెలక్టయ్యారట. తదుపరి పరీక్షల అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఆ సంస్థ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News