: రియల్ శివగామి!... తాను మునిగిపోతూ కొడుకును ఒడ్డున చేర్చిన మాతృమూర్తి
భారతీయ చలన చిత్ర రికార్డులను ఇటీవలి ‘జక్కన్న’ చిత్రం ‘బాహుబలి’ తిరగరాసింది. చిత్రంలో ‘చిన్నారి’ ప్రభాస్ ను కాపాడుకునేందుకు ‘శివగామి’ పాత్రలోని రమ్యకృష్ణ తాను నీటిలో మునిగిపోతూ బిడ్డను మాత్రం చేతిలో పైకి పట్టుకుంటుంది. ఆ సినిమాకు ఆదే ఆయువుపట్టు. చిత్ర కథకు మూలాధారం. అచ్చం అలాగే, ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళ తన ప్రాణాలు పోతున్నా, తన కొడుకు మాత్రం బతకాలనుకుంది. శివగామిలాగే కొడుకును ఎలాగోలా ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ప్రాణాలు విడిచింది. మాతృ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దిగువకన్నికాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... గ్రామానికి చెందిన రామకృష్ణ బెంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తుండగా, అతడి భార్య భువనేశ్వరి (23) మాత్రం గ్రామంలోనే ఉంటూ పశువులను కాస్తోంది. ఆ దంపతులకు రెండేళ్ల కుమారుడు కరుణాకర్ ఉన్నాడు. నిన్న ఎప్పటిలాగే బిడ్డను చంకనేసుకుని భువనేశ్వరి పశువులను కాసేందుకు వెళ్లింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలో అటవీ అధికారులు తవ్విన కందకం పూర్తిగా నీటితో నిండిపోయింది. లోతెంతుంటుందో తెలియని కందకంలోకి భువనేశ్వరి దిగింది. అయితే లోతు మరీ ఎక్కువగా ఉండటంతో ఆమె క్రమంగా నీటిలో మునిగిపోతోంది. ప్రమాదాన్ని గమనించిన భువనేశ్వరి తన ప్రాణం పోయినా, బిడ్డ ప్రాణాలు నిలబెట్టాలనుకుంది. చంకలోని కొడుకును ఒక్క వేటుతో ఒడ్డుకు విసిరేసింది. ఆ మరుక్షణమే ఆమె నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచింది. తల్లి కోసం కందకం వైపు బాలుడు వచ్చేస్తున్నాడు. మరికాసేపుంటే బాలుడు కందకంలో పడిపోయేవాడే. అదే సమయంలో అటుగా వచ్చిన భువనేశ్వరి సమీప బంధువు రంగమ్మ బాలుడు ఒంటరిగా ఉండటాన్ని చూసి అతడిని ఎత్తుకుని పరికించి చూడగా, ప్రమాదం వెలుగు చూసింది.