: తెలంగాణ రాష్ట్ర బంద్ ప్రారంభం.... అరెస్టుల పర్వం కూడా షురూ!
రైతుల సమస్యలపై సర్కారు వైఖరికి నిరసనగా విపక్షాలన్ని కలిసికట్టుగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ నేటి తెల్లవారుజాము నుంచే మొదలైంది. రాజధాని హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాల్లోనూ బంద్ దాదాపు సంపూర్ణంగా సాగుతోంది. ఆర్టీసీ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. బంద్ సందర్భంగా తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చిన విపక్ష నేతలే బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బంద్ కోసం రోడ్లపైకి వచ్చిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టీ టీడీఎల్పీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీ పీసీీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దానం నాగేందర్, టీ బీజేఎల్పీ నేత లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు అరెస్టయ్యారు. ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నేతల అరెస్ట్ లను ఆయా పార్టీల కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.