: శాంతి బాట పట్టిన ఆమెను హింస కబళించింది!


మొదట ఆమె హింసను ఆశ్రయించింది. తరువాత శాంతి బాట పట్టింది. అయినా చివరికి ఆమె ఆ హింసకే బలైంది. ఆ వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ లోని గుమ్లాకు చెందిన సంగీతకుమారి పక్కింట్లో ఉండే సవిత అనే మావోయిస్టు నేత ప్రభావంతో చిన్నతనంలోనే మావోయిస్టుగా మారింది. వంటలు చేయడంతో మావోయిస్టు జీవితం ఆరంభించిన సంగీత, త్వరలోనే షార్ప్ షూటర్ గా ఎదిగింది. ఈ క్రమంలో లాతేహార్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకుంది. తరువాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుందామని భావించేంతలో అతను ఎన్ కౌంటర్ లో బలయ్యాడు. దీంతో రహస్యంగా, అడవులు, గుట్టల వెంట బతికే మావోయిస్టు జీవితంపై విరక్తి చెంది, బాగా చదువుకుని గౌరవంగా బతకాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజులు నిర్విరామంగా నడిచి గత ఏప్రిల్ లో గుల్మా చేరుకుని రహస్యంగా తలదాచుకుంది. చంపేస్తామన్న మావోల బెదిరిపులు లెక్కచేయకుండా అక్కడ స్కూల్లో చేరింది. కుటుంబంతో గడుపుదామని మంగళవారం స్వగ్రామం సిబిల్ చేరుకుంది. ఆమె ఇంటికి చేరేలోపే ఆమె కుటుంబ సభ్యులను మావోయిస్టులు అపహరించారు. అనంతరం సంగీతను చంపేస్తామంటూ లేఖ విడిచారు. గురువారం ఉదయానికి సంగీతను రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమెను ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోలు అంతం చేసినట్టు తెలుస్తోంది. కాగా, గతంలో సంగీత మాట్లాడుతూ, మావోయిస్టులుగా ఉన్నప్పుడు దళాల్లోని మహిళలపై అత్యాచారాలు, లైంగికదోపిడీ, బలవంతపు అబార్షన్లు మామూలేనని తెలిపింది. ప్రజలకు న్యాయం చేస్తామని గొప్పగా చెప్పుకునే మావోయిస్టులు చేసే అరాచకాలకు అంతం లేదని మీడియా సాక్షిగా వెల్లడించింది. అందుకే ఆ జీవితాన్ని త్యజించానని సంగీత తెలిపింది. ఇంతలోనే తాను త్యజించిన హింసకే తాను ప్రాణాలు వదిలింది.

  • Loading...

More Telugu News