: జగన్ నీరసించారు...అయినా నిలకడగానే విపక్ష నేత ఆరోగ్యం: గుంటూరు వైద్యులు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష నేటికి మూడో రోజుకు చేరింది. గుంటూరు నగర పరిధిలోని నల్లపాడులో ఏర్పాటు చేసుకున్న దీక్షా వేదికపై మొన్న కూర్చున్న జగన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేదాకా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. దీక్ష మూడు రోజులకు చేరుకున్న సందర్భంగా నేటి ఉదయం గుంటూరు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఓ వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఆహారం ఏమీ తీసుకోని కారణంగా జగన్ కాస్త నీరసించారని ప్రకటించారు. అయితే బీపీ, షుగర్, పల్స్ రేటు సాధారణంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రేపటి వరకు కూడా దీక్ష కొనసాగితే జగన్ కు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సదరు వైద్యుడు ప్రకటించారు.