: పాకిస్థాన్ తో సంధి... ప్రధాని మోదీకి 'సీక్రెట్ ఫైల్' అందజేసిన మన్మోహన్ సింగ్!
ఇండియా, పాకిస్థాన్ ల మధ్య గతంలో సంధి కుదిరిందా? జమ్మూ కాశ్మీర్ పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలికేలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఒకప్పటి పాక్ నియంత, ఆపై అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ మధ్య చర్చలు జరిగాయా? ముసాయిదా కూడా సిద్ధమైందా? ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వార్త ఒకటి ఇదంతా నిజమని చెబుతోంది. ఓ భారత దౌత్యాధికారి సైతం దీన్ని ధ్రువీకరించినట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మన్మోహన్, ముషారఫ్ ల మధ్య రహస్య చర్చలు జరిగాయని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అందుకు సంబంధించిన సీక్రెట్ ఫైల్ ను మన్మోహన్ స్వయంగా మోదీకి అందించారని కూడా ఆ పత్రిక ప్రచురించింది. గత సంవత్సరం మే 27న మన్మోహన్ స్వయంగా వెళ్లి ఆ ఫైల్ ను మోదీకి అందించారట. భవిష్యత్తులో మరెన్నడూ కాశ్మీర్ పై వివాదం తలెత్తకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలూ జరిపిన చర్చల వివరాలు ఈ ఫైల్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది.