: రంగంలోకి రాజమౌళి, బోయపాటి శ్రీను, అశ్వనీదత్... శంకుస్థాపన వేదికకు సినీ హంగులు!
అమరావతి శంకుస్థాపన వేడుకలను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దేందుకు సినీ ప్రముఖులను ఏపీ సర్కారు రంగంలోకి దింపింది. వేదిక ఎలా ఉండాలి? మిగతా ప్రాంతాలను కనుల విందుగా ఎలా తీర్చిదిద్దాలి? అన్న విషయాలపై ప్రముఖ కళా దర్శకుడు తోట తరణితో పాటు దర్శకుడు రాజమౌళి, బోయపాటి శ్రీనుల సలహాలను, పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను స్వయంగా ఆదేశించారు. వేదికపై జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకూ సినీ హంగులు అద్దాలని నిర్ణయించారు. మూడు ప్రత్యేక గీతాలను తయారు చేయాలని, అమరావతి సంస్కృతిని తెలిపేలా ఒకటి, రైతులకు వందనం చెప్పేలా మరొకటి, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకో గీతాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి నృత్య రీతులు సమకూర్చాలని ఆయన ఆదేశించారు. 15 నిమిషాల పాటు సాగేలా కూచిపూడి బ్యాలే కూడా తయారు చేయించాలని బాబు నిర్ణయించారు. ఈ పాటలకు కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ లు సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని ముఖ్యపనులను నిర్మాత అశ్వనీదత్ కు అప్పగించినట్టు సమాచారం.